17, మార్చి 2014, సోమవారం



                        శ్రీ ఆంజనేయ దండకం
                రచన వడ్డూరి అచ్యుతరామ కవి
శ్రీ అంజనాదేవి సత్పుత్ర! సుగ్రీవమిత్రా! సునేత్రా!సుగాత్రా!విచిత్ర  క్రియా దివ్య సంస్తుత్య చారిత్ర !శ్రీ ఆంజనేయా !మహా కాయ !శ్రీ వాయు పుత్రా !భవన్నామముల్ భక్తి ధ్యానించు వారిన్  సదా బ్రోచిరక్షించు కారుణ్య చిత్తుండ వంచున్ స్వబుద్ధిన్ విచారించి  ధీరత్వ మొప్పారనే కార్య మైనన్ ఫల ప్రాప్తి సేకూర సంపూర్తి గావిమపగా నేర్చువీరాగ్ర గణ్యుండవంచున్ మహా బుద్ధిమంతుండ వంచున్ జగంబందు దుస్టాత్ములన్ ద్రుంపగా రుద్ర తేజంబుతో సర్వ శక్తుల్ మహా మూర్తిగా రూపు గొన్నట్టి సద్భక్త చింతామణీ !యార్త రక్షామణీ !రామ భక్తాగ్రణీ ! దైవచూడామణీ! నిన్ను నే నెప్పుడున్ భక్తిధ్యా నింతునో కీశ వంశాగ్రణీ! రామశుగ్రీవ సఖ్యంబు సాధించి యా రాము నాజ్ఞన్ వెసన్ జానకీదేవి గానంగ దుర్లంఘ్యమౌ దక్షిణాంభోనిధిన్ దాటి లంకాపురిన్ జేర నాటంకముల్  గూర్చు ఛాయాగ్ర హానేక దోషాచర శ్రేణి బోకార్చి లంకన్ బ్రవేశించి !యాలంకిణిన్ గూల్చి లంకాపురంబెల్ల గాలించి యా జానకీ దేవినిన్ గాంచి శ్రీ రామ చరిత్రమున్ దెల్పి యాయుంగరం బానవాలిచ్చియాననందమున్ గూర్చి శ్రీ జానకీ భూషణంబైన చూడామణిన్జానకీ వార్తగా భద్రమున్ జేయుచున్ దూత కృత్యంబు సాధించి లంకేసునిన్ గాంచి శ్రీరాము దివ్య ప్రభావంబు దెల్పంగ నూహించి నీ వాయసోకాటవిన్  పుష్పవృక్షాదులన్ గూల్చి అక్షాదులన్ జెండి లంకాపురిన్ గాల్చి వేవేగ శ్రీ రామునిన్ జేరి సీతామహాదేవి క్షేమంబు విన్పించి యానంద మున్ గూర్చి లోకంబునం దేవ్వరన్ జేయలేనట్టి శ్రీ రాము కార్యంబు సాధించి యున్నట్టి నీచిత్ర చారిత్ర మెన్నంగ నీ దేహముప్పొంగ నానందమున్ జెంది నిన్గొల్చు భక్తాలి గాపడుదో దేవ! శ్రీ కేసరీపుత్ర!సౌమిత్రి ప్రాణంబు నిల్పంగ సంజీవినిన్ దెచ్చు నానాటి నీ యా మహా శక్తి యుక్తి ప్రభావంబు లేన్నన్ మహా చిత్రముల్ గాదె నీ కార్య నిర్వాహ కొద్యోగ చాతుర్యముల్ వర్ణనా తీతముల్ దేవ!నీ శక్తి నీవే గ్రహింపంగ లేరందురన్యుల్ గ్రహింపంగ తామెంత ధీమంత! శ్రీ వీర హనుమంత! నీయంతవారీ యనంతావనిన్ లేరు నిన్ బ్రస్తుతింపంగ నే నెంత!శ్రీ రామభక్తాగ్రణీ! రామదూతా! నమో లక్ష్మణ ప్రాణ దాతా! నమో జానకీ శోకనాశా! యటన్నన్ మహా వీర! నీ డెంద ముప్పొంగదే! యాంజనేయప్రభూ! నీదు నామంబు ధ్యానించినన్  నీదు రూపంబు భావించినన్ భూత భేతాళ దుష్ట గ్రహానేక బాధల్ ,మహాశతృబాధల్ నశించున్ గదా!నామ పారాయ ణానంద చిద్రూప! శ్రీ కేసరీపుత్ర!సౌందర్యగాత్రా! మహా చిత్ర చారిత్ర ! శ్రీ మారుతీ ! దేవ దేవా ! సదా సత్య సంకల్ప! నేనల్పుడన్!నా దు  దోషంబులన్ సైచి పాపంబులన్బాపి రక్షింపవే దుష్ట శిక్షా ! నమో భక్తరక్షైక దీక్షా ! విపక్షౌఘ శిక్షా !సదా రామ పాదార విందార్చనానంద చిద్విగ్రహా !భక్త మందార !యో వీర !యో ధీర ! యోదేవవంద్యా! జగత్ ప్రాణ పుత్రా !లసద్వజ్రగాత్రా ! సుచారిత్ర మాం పాహి ! శ్రీ అచ్యుతారాధితా ! భక్త నేతా ! నమస్తే  సదా రామ భక్తాగ్రణీ! కీశనాధా ! నమస్తే !నమస్తే !నమస్తే ! నమః !    

3 కామెంట్‌లు:

  1. ఈ ఆంజనేయ దండకం మా తండ్రి గారు శ్రీ వడ్డూరి అచ్యుతరామ కవి గారు రచించిన సుందర కాండ పద్య పారాయణ నుండి గ్రహించ బడింది ఈయన రచించిన శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం తెలుగు అనువాదం గ్రంధం లొ ప్రచురింప బడింది యీ గ్రంధములు కావలసిన వారు సంప్రదించవలసిన ఫోన్ 9959117167 నేను కవి గారి నాల్గవ కుమారుడను నేను తణుకు లొ ఉంటాను

    రిప్లయితొలగించండి
  2. యీ శ్రీ ఆంజనేయ దండకమును ప్రతి రోజు ఎవరు చదువుతారో వారికి భూత పిశాచ బాధలు తొలగి సుఖ సంతోషములు కలుగును

    రిప్లయితొలగించండి