25, మార్చి 2014, మంగళవారం

     https://encrypted-tbn3.gstatic.com/images?q=tbn:ANd9GcRMriEb9e9e8_JMm0U-nZ2R0FaXH4unQ0BD_OVvfqLFXbPjIpOz                               శ్రీవెంకటేశ్వర భక్తిమాల         రచన : శ్రీ వడ్డూరి అచ్యుతరామ కవి
                                                                        
ఎన్నిమారులు చూచిననేమొగాని
తనివిదీరదు నీదివ్య దర్శనంబు
చూచినను చూచుచున్నను చూడగోరు
చూపుమికెప్పుడు నీదివ్య రూపమభవ !
శ్రీ మద్వెంకట శైలమందు విభవ శ్రీ మీర నాంచారియున్
భామారత్నము మంగమాంబయును సంభావించి సేవింపగా
కామారాతి మహేంద్ర ముఖ్యులు నుతుల్ గావింప భక్తాలికిన్
సేమంబుల్ సమకూర్చు దేవు గొలుతున్ శ్రీ వెంకటేశప్రభున్ 
నరక మురాదిదానవ వినాశనకారికి దుఃఖహారికిన్
గరుడవిహారికిన్ మహిత కౌస్తుభధారికి చక్రధారికిన్
దురిత విదారికిన్ జనన దుఃఖనివారక నామధారికిన్
తిరుమల వెంకటేశు నకు దేవరకున్ శరణా ర్ధి నయ్యెదన్!
పంకజాసన వాసవార్చిత భక్తలోక శుభంకరా !
వేంకటాచలవాస! కేశవ విస్వకారణ శ్రీధరా!
శంకరార్చిత పాదపంకజ శంఖచక్ర గదాధరా !
వేంకటేశ్వర! వేంకటేశ్వర ! వేంకటేశ్వర ! పాహిమాం !!
పరమపావన భక్త జీవన పాపకానన దాహనా !
గరుడవాహన లోకమోహన కంజ సన్నిభ లోచనా!
శరధి శయన రమా మనోహర సర్వలోక నియామకా!
తిరుమలేశ్వర వేంకటేశ్వర దీనరక్షక రక్షమాం !!
శ్రీకరంబగు వేంకటాచల శిఖరమందు   వసించుచున్
ప్రాకటంబుగ భక్తులను గాపాడుచుందువు దేవరా !
నీకు మ్రొక్కెద బ్రోవవే నను నీలనీరద వర్ణ లో

కైక నాయక వేంకటేశ్వర గరుడవాహన శ్రీహరీ !!

1 కామెంట్‌:

  1. మా నాన్న గారు రచించిన శ్రీ వెంకటేశ్వర భక్తిమాల నుండి కొన్ని పద్యాలు

    రిప్లయితొలగించండి